జూన్ నాటికి విద్యారంగ పనులు పూర్తి కావాలి

విద్యారంగంం పై సిఎం వైఎస్ జగన్ సమీక్ష

అమరావతి,జ్యోతిన్యూస్ : నాడు-నేడు కార్యక్రమం కింద మొదటి దశలో 15 వేల స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.లాక్ డౌన్ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులంతా వీటిని వినియోగించు కోవాలని కోరారు. యూనివర్సీటీలలో కూడా ఆన్లైన్ క్లాసులు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. గేట్ కోచింగ్ కూడా ఆన్‌లైన్ ద్వారా ఇచ్చేందుకు జేఎన్‌టీయూ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు స్కూళ్లు తెరిచాక విద్యార్థులకు కావాల్సిన యూనిఫామ్స్, బుక్స్ ను సిద్ధం చేస్తున్నామని మంత్రి సురేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ‘నాడు-నేడు’ కింద చేపడుతున్న కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శనివారం తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు సిఎం జగన్ పలు సూచనలు చేశారు. జూన్ నాటికి పనులు పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్కూళ్లలో ఫర్నిచర్, చాక్ బోర్డ్స్, తదితర వాటికి దాదాపుగా టెండర్లు పూర్తయ్యాయని అధికారులు సిఎం జగన్‌కు వివరించారు. మిగిలిన ఒకటి రెండు అంశాలకు కూడా త్వరలోనే టెండర్ల పక్రియ పూర్తి చేస్తామన్నారు. 72,596 గ్రీన్ చాక్ బోర్డ్స్ కోసం రివర్స్ టెండర్లలో రూ.5.07 కోట్లు ఆదా అయినట్లు సిఎం జగన్ కు అధికారులు తెలిపారు. రూ.79.84 కోట్లు టెండర్లలో ఎల్ 1 కోట్ చేస్తే.. రివర్స్ టెండర్లలో రూ.74.77 కోట్లుగా ఖరారైందన్నారు. 16,334 అల్మరాల కోసం రూ.19.58 కోట్లకు ఎల్ 1 కోట్ చేస్తే, రివర్స్ టెండర్లలో రూ. 15.35కు ఖరారైందని, తద్వారా రూ. 4.23 కోట్లు ఆదా అయ్యిందని సిఎం జగన్ కు అధికారులు వివరించారు.