లాక్ డౌన్ రూల్స్ నీరుగార్చొద్దు

సాధ్యాసాధ్యాలు మదింపు చేశాకే నిర్ణయం అన్న కేంద్రం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మే 31వరకు అమలు చేస్తున్న లాక్ డౌన్ 4.0 మార్గదర్శకాల అమలును నీరుగార్చొద్దని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. జోన్ల వారీగా ఆంక్షల అమల్లో రాజీ పడొద్దని వెల్లడించింది. రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హెూం కార్యదర్శి అజయ్ భల్లా ఈ మేరకు లేఖ రాశారు. ‘గత లేఖల్లో నొక్కి చెప్పినట్టుగానే, కేంద్ర హెూమంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను నీరుగార్చొద్దు. పరిస్థితులను మదింపు చేసి వేర్వేరు జోన్లలో అవసరమైతే ఆంక్షలను కఠినతరం లేదా సులభతరం చేయాలి. తాజా మార్గదర్శకాలను కఠినంగా అమలు చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేయాలని కోరుతున్నా’ అని అజయ్ భల్లా ప్రస్తావించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకున్నాకే రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను రాష్ట్రాలే వర్గీకరించేందుకు నూతన మార్గదర్శకాలు అవకాశం కల్పిస్తున్నాయని ఆయన తెలిపారు. కంటైన్మెంట్ జోన్ల పరిధిలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు. వ్యక్తుల కదలికలను నియంత్రించాలని వెల్లడించారు. వైద్యం, ఔషధాలు, నిత్యావసర వస్తువులు, సేవల కోసం తప్ప జోన్లు దాటి ఎవరినీ బయటకు రానీయొద్దని తెలిపారు. దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో కొన్నింటికి అస్సలు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు.