కరోనాకు ప్రత్యేకంగా

ఫార్ములా లేదు రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్

వేములవాడ: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలంతా సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు. కరోనాకు ఒక ఫార్ములా అంటూ లేదని.. సోకకుండా చూసుకోవడమే మేలని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ముస్తాబాద్ మండలం గూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్ తనిఖీ చేశారు. ఆ తర్వాత వేములవాడలో కంటైన్మెంట్ ప్రాంతంలో చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పలుచోట్ల స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కరోనా నివారణకు స్వీయ నియంత్రణే మందు అని.. రానున్న రెండు వారాలు కూడా ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మర్కజ్ ఘటన లేకపోతే జిల్లాల్లో ఒక్క కేసు కూడా ఉండేది కాదన్నారు. వేములవాడలో ఓ యువకుడికి కరోనా సోకిందని.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి బాగున్నట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారన్నారు. ఆ య ఎవకుడితో సన్నిహితంగా మెలిగిన 21 మందిని క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్లు మంత్రి వివరించారు. వేములవాడలో ఒక్క కేసు మాత్రమే నమోదైందని..కంటైన్మెంట్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. భారతదేశ ధాన్యాగారం తెలంగాణ అని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం 40 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు పండించారని చెప్పారు. కనీస మద్దతు ధర ఇచ్చి గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు భౌతికదూరం పాటించాలని..పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామని మంత్రి చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యాన్ని 88శాతం మందికి పంపిణీ చేశామని.. బ్యాంకు ఖాతాలున్న లబ్ధిదారులకు రూ.1500 చొప్పున నగదు జమ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 74 లక్షల మంది ఖాతాల్లో నగదు జమ చేసినట్లు కేటీఆర్ వివరించారు. తెలంగాణ అభివృద్ధిలో వలస కార్మికులు భాగస్వాములని.. వారిని ఆదుకుంటున్నామని చెప్పారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీరి కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. కేవలం హైదరాబాద్లోనే 55 శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.