కండల రాణి కవితాదేవి

భారత్‌లో మహిళలు అంటే సుకుమారంగా ఉండే గహిణులు మాత్రమే కాదు…అవసరమనుకుంటే మగవారు సత్తాచూపే క్రీడల్లోనూ తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంటారు. 35 ఏళ్ల వయసులో ఓ వైపు కుటుంబబాధ్యతలు నిర్వర్తిస్తూనే కుస్తీలు పట్టే ధీరాదిధీరలు కేవలం భారత మహిళలు మాత్రమే అనటానికి..

నిలువెత్తు నిదర్శనం కవితాదేవి.
కవితాదేవి పుట్టి పెరిగింది హర్యానాలోని జింద్‌ జిల్లాకు చెందిన మాల్వీ (జులన) అనే చిన్న గ్రామం. ఒక అథ్లెట్‌గా ఎదగడానికి ఎలాంటి వసతులూ లేని ప్రాంతం అది. జులనాలోని గర్ల్స్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్లో చదువుకుందామె. కవిత పెరిగిన సమాజంలో ఆడపిల్లలు పదోతరగతి కంటే ఎక్కువ చదవగలమనే ఆలోచనే చేయరంటే.. అక్కడ ఆడపిల్లల స్థానమేంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. అక్కడ బాలికా భ్రూణహత్యలు, బాలికా హత్యలు చాలా ఎక్కువ. అలాంటి ప్రదేశం నుంచి వచ్చిన కవిత ఒక అథ్లెట్‌గా నిరూపించుకోవడమే స్ఫూర్తినిచ్చే విషయం. అలాంటి పరిస్థితుల్లో కవిత తన అన్నయ్య సందీప్‌దలాల్‌ ప్రోత్సాహంతో డిగ్రీ వరకూ చదివి, క్రీడాకారిణిగా ఎదిగింది.
ఉద్యోగం వదిలేసి.. పతకాలు సాధించి
డిగ్రీ పూర్తయిన తర్వాత కవితాదేవి సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ కాసే ఆర్మ్‌డ్‌ బోర్డర్‌ ఫోర్స్‌ (సశస్త్ర సీమాబల్‌)లో పనిచేయాలని నిర్ణయించుకుని, స్పోర్ట్స్‌ కోటాలో కానిస్టేబుల్‌గా చేరింది. అప్పటి నుంచి కొన్ని టోర్నమెంట్లలో పాల్గొనేందుకు ప్రభుత్వం అనుమతించకపోవడం, దానివలన రష్యాలో నిర్వహించిన ఒక అంతర్జాతీయ టోర్నమెంట్‌కు వెళ్లలేకపోవడం కవితకు నచ్చలేదు. ఆ తర్వాత క్రీడల్లో ఎక్కువ సమయాన్ని కేటాయించడం కోసం తాను సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నప్పుడు పదవీవిరమణ పొందింది. ఇంత నిబద్ధత, ధైర్యం పుణికి పుచ్చుకున్న మహిళలో ఆత్మాభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. అదే ఆలంబనగా ఒక క్రీడాకారిణిగా ఆమె తన జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో కవిత 2016 సౌత్‌ ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొని, వెయిట్‌లిఫ్టింగ్‌లో జాతీయస్థాయిలో బంగారు పతకం సంపాదించడమే కాదు వుషు, మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ జాతీయస్థాయి గుర్తింపు సాధించింది. అయితే ప్రాథమికంగా ఆమె ద ష్టంతా వెయిట్‌లిఫ్టింగ్‌ పైనే ఉండేది. కవిత క్రీడాకారిణి మాత్రమే కాదు ఒకరికి భార్య, ఓ బిడ్డకు తల్లి. వాలీబాల్‌ క్రీడాకారుడు గౌరవ్‌ తోమర్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఇప్పుడామెకు ఐదేళ్ల కొడుకున్నాడు. భర్త తండ్రి కూడా కబడ్డీ క్రీడాకారుడవ్వడం వల్ల కవితకు అత్తారింట్లోనూ మంచి ప్రోత్సాహం లభించింది.
అలా అందరి దష్టిలో
గతంలో భారతదేశం నుంచి సౌత్‌ ఏషియన్‌ గేమ్స్‌లో పాల్గొని, పవర్‌ లిఫ్టింగ్‌లో గోల్డ్‌మెడల్‌ సాధించిన కవితాదేవి.. ఇప్పుడు మరొక చరిత్ర సష్టించి అందరి దష్టిలో పడింది. ఇప్పటివరకూ వరల్డ్‌ రెజిలింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో భారతదేశం నుంచి మహిళలు పాల్గొనలేదు. మహిళల కోసం మొదటిసారి ప్రత్యేకంగా నిర్వహించదలచిన డబ్ల్యూడబ్ల్యూఈ టోర్నమెంట్‌ ‘మేరు యంగ్‌ క్లాసిక్‌’లో అంతర్జాతీయ మహిళా రెజలర్లతో కవితాదేవి ‘హార్డ్‌కేడీ’ పేరుతో తలపడనుంది. 32 మంది మహిళా రెజలర్లు పోటీపడే ఈ టోర్నమెంట్‌లో సరిగా రాణించలేకపోతే సింగిల్‌ ఎలిమినేషన్‌లో వెనుతిరగాల్సిందే. అయితే కవిత ఈ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌ షిప్‌లో పాల్గొనడానికి కఠినమైన శిక్షణ తీసుకుంది. అంతర్జాతీయంగా మంచి పేరున్న రెజలర్‌, అంతర్జాతీయ హెవీ వెయిట్‌ ఛాంపియన్‌, ది గ్రేట్‌ ఖలీ (దిలీప్‌సింగ్‌ రాణా) పంజాబ్‌లో నిర్వహిస్తున్న రెజిలింగ్‌ ప్రమోషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ అకాడమీలో ఆమె శిక్షణ పొందింది. అయితే కవిత పాపులర్‌ అయ్యింది మాత్రం రెండు సంఘటనలతో. వాటిలో ఒకటి ఆమె దుబారులో డబ్ల్యూడబ్ల్యూఈ ట్రై అవుట్‌కు వెళ్ళినప్పుడు. అక్కడ కవిత చూపించిన అద్భుత ప్రదర్శనను అందరూ మెచ్చుకున్నారు. మొదటి సంఘటన ఏంటంటే… కవితాదేవి రెజిలింగ్‌లోకి అడుగుపెట్టాలనే ఆలోచనతో గ్రేట్‌ ఖలీ నిర్వహిస్తున్న కాంటినెంటల్‌ రెజిలింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (సిడబ్ల్యూఈ)కు వెళ్లింది. అప్పటికి సశస్త్ర సీమాబల్‌ కానిస్టేబుల్‌గా ఉన్న ఆమె సిడబ్ల్యూఈలో రెజిలింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న బి బి బుల్‌ బుల్‌ అనే మరో మహిళా రెజలర్‌తో అనుకోకుండా తలపడింది. ఫైటింగ్‌ చూస్తూ నిలబడిన కవిత.. బుల్‌ బుల్‌ తనతో పోరాడటానికి దమ్మున్న వారెవరైనా రావచ్చు అనే బహిరంగ సవాలుకు స్పందించి.. బరిలోకి దిగింది. అయితే బుల్‌ బుల్‌కూ, కవితకు జరిగిన ఆ ఫైటింగ్‌ కాస్తా.. సీరియస్‌గా మారి, ఇద్దరూ విచక్షణా రహితంగా కొట్టుకున్నారు. అప్పట్లో ఆ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. అప్పడే కవిత అందరి దష్టినీ ఆకర్షించింది.
మన సత్తా చాటతా!
హార్డ్‌కేడీగా మారిన కవితాదేవి ప్రస్తుతం రెజిలింగ్‌ రింగ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్టైల్‌తో అలరిస్తుంది. హెడ్‌ కేవింగ్‌ రౌండ్‌హౌస్‌ కిక్‌తో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తుంది. దుబారులో జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ ట్రైఅవుట్‌లో మంచి ప్రదర్శన చేసిన కవితాదేవిని డబ్ల్యూడబ్ల్యూఈ టాలెంట్‌ డెవలప్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కన్యోన్‌ సిమన్‌ ప్రశంసించాడు. ”దఢమైన మహిళగా, ఒక అథ్లెట్‌గా ఆమె క్రీడలకున్న వినోదపు మూల సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకుంది. దీనిద్వారా ఆమె ‘మేరు యోంగ్‌ క్లాసిక్‌’ టోర్నమెంట్‌లో బాగా రాణించగలదని” సిమన్‌ అభిప్రాయం వెలిబుచ్చాడు. ఈ టోర్నమెంట్‌కు చరిత్రలోనే గొప్ప రెజలర్‌గా పేరు ప్రఖ్యాతులు సాధించి, డబ్ల్యూడబ్ల్యూఈ హాల్‌ ఆఫ్‌ ఫేమర్‌, సూపర్‌స్టార్‌గా పేరొందిన మహిళా రెజలర్‌ జాన్నీ మేరు యోంగ్‌ పేరుపెట్టారు. ఫ్లోరిడాలోని ఓర్లాండ్‌ వేదికగా ఈ పోటీలు జరగడం విశేషం.
”మహిళలతో నిర్వహించే మొట్టమొదటి డబ్ల్యూడబ్ల్యూఈ టోర్నమెంట్‌లో పాల్గొనే మొట్టమొదటి మహిళా రెజలర్‌ నేనైనందుకు చాలా గర్వపడుతున్నాను. భారతీయ మహిళలు నా నుంచి స్ఫూర్తి పొందే విధంగా ఈ వేదికను ఉపయోగించుకుంటాను. నా ప్రదర్శనతో భారతదేశం గర్వపడేలా చేస్తాను” అంటున్న హార్డ్‌కేడీ కవితాదేవి అంతర్జాతీయ స్థాయిలో భారత స్త్రీ సత్తాను చాటాలని మనమూ ఆశిద్దాం!! ఆల్‌ ది బెస్ట్‌ కవితాదేవి!!!