భారత్ లో అదే జోరు తగ్గని కరోనా స్పీడ్…

33 వేలకు పైగా పాజిటివ్ కేసులు, 1074 మరణాలు

న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో ఈ వైరస్ తో దేశవ్యాప్తంగా 67 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 1074కి చేరింది. కొత్తగా 1718 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 33,050కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ప్రస్తుతం మొత్తం బాధితుల్లో 8325 మంది కోలుకోగా మరో 23,651 మంది చికిత్స పొందుతున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న దృష్ట్యా హాట్ స్పాట్ కాని జిల్లాల్లో లాక్ డౌన్ సడలింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకు పోయిన వలస కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులు, యాత్రికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర హెూంశాఖ అనుమతి ఇచ్చింది. వీటికోసం కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనికోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించింది.మహారాష్ట్రలోనే అత్యధిక తీవ్రత.. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 32 మరణాలతోపాటు 597 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9915 చేరగా 432మంది మృత్యువాత పడ్డారు. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో ఈ వైరస్ తీవ్రత ఆందోళనకరంగా ఉంది. గుజరాత్ లో మొత్తం కేసుల సంఖ్య 4082కి చేరగా వీరిలో ఇప్పటివరకు 197 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ లోనూ కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 2561 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 129 మంది మరణించారు. దేశ రాజధాని దిల్లోలోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3439 మందికి కరోనా సోకగా 56మంది మరణించారు.ఆంధ్రప్రదేశ్ లో 1332, తెలంగాణలో 1016.. ఆంధ్రప్రదేశ్ లో వైరస్ తీవ్రత కొనసాగుతోంది. కేవలం నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా 73 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం 1332 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 31 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1016కి చేరగా 25మంది మ రణించినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. గత మూడు రోజులుగా రాష్ట్రంలో కేవలం 10లో పే కొత్త కేసులు నమోదవుతుండటం ఊరటకలిగించే విషయం.